మనం రైల్లో ప్రయాణం చేస్తుంటే చాలామంది పాటలు పాడుతూ డబ్బులు అడగడం మనకు తెలుసు. అప్పుడు మనకు ఇష్టం ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. కానీ ఓ టాప్ హీరో వచ్చి అలా పాటలు పాడి డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వకుండా ఉంటామా? అది కూడా సాక్షాత్తు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వచ్చి పాడితే! కేన్సర్ రోగులకు చికిత్స చేయించేందుకు డబ్బులు సేకరించడానికి ఆయన రైళ్లలో పాటలు పాడారట. ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని డబ్బులు సేకరించి వితరణ కార్యక్రమాలకు అందించే సౌరభక్ నింబ్కర్‌తో కలిసి ఆయన పాటలు పాడారు. సిల్‌సిలా చిత్రంలో తాను స్వయంగా పాడిన 'రంగ్ బర్‌సే భీగే చునర్ వాలీ రంగ్ బర్‌సే' లాంటి పాటలతో ప్రయాణికులకు హుషారెత్తించారు.
విక్టోరియా టెర్మినస్ నుంచి భందుప్ స్టేషన్ వరకు రైల్లో ప్రయాణించి, సౌరభ్‌తో కలిసి పాటలు పాడినట్లు అమితాబ్ ట్వీట్ చేశారు. ముంబై నగరంలో ఉండే నిరుపేద కేన్సర్ రోగులు, వాళ్ల కుటుంబాల కోసం ఈ డబ్బులు ఉపయోగిస్తారని ఆయన తన బ్లాగ్‌లో తెలిపారు. ఇది కేవలం మీడియాలో ప్రచారం కోసం కాదని, ఇలాంటి మంచి పని చేస్తున్న సౌరభ్ లాంటి వాళ్లకు కాస్త సాయం చేయాలన్నదే తన ఉద్దేశమని అన్నారు. అతడి కృషి అభినందనీయమని చెప్పారు. సౌరభ్ నింబ్కర్ రోజూ రైళ్లలో తిరుగుతూ పాటలు పాడి నిధులు సేకరిస్తుంటాడు. అతడికి కూడా ముందుగా చెప్పకుండా అమితాబ్ వెళ్లి పాటలు పాడటంతో అతడు కూడా ఆశ్చర్యపోయాడు.
No comments:
Post a Comment